Srisailam | శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం (నిత్య కళారాధన కార్యక్రమంలో) భాగంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా వాసి యర్రంశెట్టి ఉమామహేశ్వర్ రావు సారధ్యంలోని బృందం గీతావధానం కార్యక్రమం నిర్వహించింది. ఈ గీతావధాన కార్యక్రమాన్ని ఈవో డీ పెద్ది రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మనస్సును ఒక అంశంపై ఏకాగ్రతతో నిలిపి ఉంచడాన్ని అవధానం అని అంటారు. అవధానాల్లో పలు రకాల అవధానాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ధారణావధానం, స్రుజలనాత్మక అవధానం పేరొందాయి.
ధారణావధానం పరిధిలోకి గీతావధానం వస్తుంది. భగవద్గీతలోని అన్ని శ్లోకాలను, అధ్యాయాలను వాటి సంఖ్యతో సహా గుర్తుంచుకుని, పృచ్చకులు ఏరకంగా ప్రశ్నలు అడిగినా సమాధానాలు ఇవ్వడమే గీతావధానం. శనివారం నిర్వహించిన గీతావధానానికి శతావధాని బులుసు అపర్ణ సంచాలకులుగా వ్యవహరించారు. ఈ గీతావధానంలో పృచ్చకులుగా మీనాక్షి, అన్నపూర్ణ, సుజాత, మారుతి, శివ నారాయణ, ఝాన్సీ, తంగిరాల ఉదయ చంద్రిక, మానస వ్యవహరించారు.