Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా ఇవాళ సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అడుగడుగునా పూలు చల్లారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావం తెలపడంతో పాటు టీడీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యభూమిక పోషించిన పవన్ కల్యాణ్‌కు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద గజమాలతో సత్కరించారు. ఇక సచివాలయ ఉద్యోగులు కూడా పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్‌కు సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.