తిరుపతి జిల్లా : వినాయక చవితి ప్రారంభమైంది. ఊరూవాడా వినాయక విగ్రహాలతో కలకలలాడుతున్నాయి. పూజలు, భజంత్రీ చప్పుళ్లతో మండపాలు మార్మోగుతున్నాయి. రకరకాల విగ్రహాలు కొలువుదీరి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలోకి తిరుపతి తుమ్మలగుంట వినాయకుడు చేరాడు. పీఓపీ, మట్టితో కాకుండా వెరైటీగా పండ్లతో అదీ పైనాపిల్ పండ్లతో రూపుదిద్దుకున్న గణనాయకుడ్ని చూసేందుకు భక్తులు విశేషంగా వస్తున్నారు.
తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుడిని తయారుచేసేందుకు దాదాపు 7 వేల పైనాపిల్స్ వాడారంట. 25 మంది పనోళ్లు 16 రోజులపాటు పనిచేసి ఈ భారీ గణనాథుడ్ని సిద్ధం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మురళి సారధ్యంలో ఈ 22 అడుగుల ఎత్తైన విగ్రహం కొలువుదీరింది. ఈ పైనాపిల్ విగ్రహం వద్ద పూజల్లో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పైనాపిల్ విగ్రహాన్ని నెలకొల్పిన బాల వినాయక కమిటీని ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు పలువురు భక్తులు కొనియాడారు.
ఈ పైనాపిల్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే ప్రాంగణంలో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెరుకు గడలతో పైనాపిల్ వినాయక మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. అలాగే 1116 కిలోల లడ్డూ ప్రసాదంగా పెట్టారు. ముఖ్య అతిథులను వేదపండితులు ఆశీర్వదించారు. పర్యావరణ పరిరక్షణను గుర్తుచేసేందుకే ఈ పైనాపిల్ వినాయకుడ్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.