Visakha Files | సింహాచల భూసమస్యలపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ 2041 మాస్టర్ ప్లాన్‌ను రివైజ్ చేస్తామని తెలిపారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.
విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ.. వైజాగ్‌లో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని అన్నారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేవలం 30 రోజుల్లోనే కీలక హామీలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. డీఎస్సీ, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి వాటిపై సంతకాలు పెట్టిన విషయాలను గుర్తు చేశారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారనే వార్తలు కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో వాటిని పట్టించుకోకుండా.. ఎప్పుడూ మీడియాలో కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే రిషికొండ భవనాల వద్దకు వెళ్లి తనతో పాటు మీడియాను తీసుకెళ్లి రచ్చ చేశారు. రుషికొండ ప్యాలెస్‌లోని బాత్రూమ్లు, ఇతర కాస్ట్లీ ఫర్నీచర్ చూపిస్తూ ఆయన చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు తాజాగా విశాఖ ఫైల్స్ తీస్తామని చెప్పడం సంచలనంగా మారింది.