Pawan Kalyan | ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఏపీ సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. కుల గణన చేపట్టడానికి కారణాలను వివరిస్తూ ప్రభుత్వపరమైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని అడిగారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత స్వేచ్ఛను హరించడం కాదా అని ప్రశ్నించారు.వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తామని తెలిపారు. దీంతో పాటు పలు ప్రశ్నలు సంధిస్తూ ఏపీ సీఎం జగన్కు పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు.
ఆ లేఖలోని మరిన్ని ప్రశ్నలు..
☞ కుల గణన మీ ఉద్దేశమైతే.. ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్య వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలు ఎందుకు అని ప్రశ్నించారు
☞ జనగణన ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది ఎంతోమంది నిపుణులతో చేయాల్సిన ప్రక్రియ. మీ వలంటీరర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారు?
☞ ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జి అనలిటికా చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతి, అల్లర్లను ప్రేరేపించాయనే విషయం మీకు తెలియదా? వాటిని ఎన్నిక కోసం స్వీయ ప్రయోజనాల కోసం మాకు తెలియదని అనుకుంటున్నారా?
☞ ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? ఒకవేళ కాకపోతే, ఇలా సేకరించిన డేటా ఏవిధంగానూ దుర్వినియోగం కాకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి?
☞ ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అంరదూ మీ నియంతృత్వానికి తలవంచుతారని అనుకుంటున్నారా?
☞ ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం.. దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పోడవడం కాదా?