అమరావతి : ఏపీలో తలెత్తిన విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఎందుకు స్పందించడం లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో వరద ముంపునకు గురైన సింగ్‌నగర్ కాలనీ బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీని సందర్శించారు.
దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటకు కారణమైన ఏపీ కష్టాల్లో ఉంటే ఆదుకోరా అని నిలదీశారు. సుమారు 5 లక్షల మంది వరద ప్రభావానికి లోనయ్యారని, లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అన్నారు. ఘోర విపత్తు జరిగితే ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు కేంద్రానికి మద్దతు తెలుపుతుంటే ఏపీ ప్రజల ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల నుంచి ఏపీ ఎంపీలు (MPs) బీజేపీ పార్టీకి బానిసలుగా భుజాన ఎత్తుకుని తిరుగుతున్నారని, అందుకు బహుమానంగా మోదీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు.
ప్రతి అంశాల్లోనూ చిన్నచూపు చూస్తున్నారని, ఏపీ విపత్తున జాతీయ విపత్తుగా ప్రకటించాలని, వర్షంతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికీ రూ. లక్షా, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5లక్షలు ఇవ్వాలని, పంట నష్టం కింద రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్తు మళ్లీ రాకుండా చంద్రబాబు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. బుడమేరు (Budameru) పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వైఎస్ జగన్ బుడమేరును పట్టించుకోక పోవడం వల్లే విజయవాడ ముంపునకు గురయిందని ఆరోపించారు.