అమరావతి : వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు ట్విట్టర్ (Twitter ) లో ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన వైఫల్యాలతో కొనసాగిందని ఆరోపిస్తూ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. వందరోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల మనస్సులను గాయపర్చిందని విమర్శించారు.
ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఎందుకు ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మెనిఫెస్టో(Manifesto) లో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందిందని ప్రశ్నించారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంగా ప్రకటించుకునే చంద్ర బాబు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో కులప్రాతిపదికనే జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయని, ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకొచ్చిందని పేర్కొన్నారు.
అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి నేతలను పట్టించుకోవడం లేదని వస్తున్న వార్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరదల సన్నద్ధత, అమరావతి భవిష్యత్తుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, ఇటీవల గుజరాత్లో జరిగిన సమ్మీట్లో పారిశ్రామిక వేత్తలు సుముఖతను వ్యక్తం చేయాలేదని అన్నారు.