అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీకి చెందిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబును (Nagababu) ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వస్తున్న కథనాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్పందించారు. త్వరలో నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.
నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తరువాతనా, ముందుగానేనా అనే అంశాన్ని ఆయన ప్రస్తావించలేదు. కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేన (Janasena) పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ నీడలా ఉంటూ వచ్చిన నాగబాబుకు సముచిత స్థానంలో కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన అధినేతల మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం . ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర కూడా నాగబాబు మంత్రివర్గంలోకి చేరికను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీసీలను గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, తనను, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని,ముఖ్య నాయకులను జైలులో పెట్టారని ఆరోపించారు. మచిలిపట్నంలో రైస్ గోదాంలో రేషన్ బియ్యం విషయంపై ఆయన మాట్లాడుతూ తప్పు చేయకపోతే నాని ఎందుకు భయపడుతున్నారని, మీకు తెలియకుండా మేనేజర్ బియ్యం మాయం ఎలా చేస్తాడని ప్రశ్నించారు.