తిరుమల : తిరుపతి లడ్డూ (Tirupati Laddu ) కల్తీ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను టీటీడీ మాజీ చైర్మన్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (MP YV Subbareddy ) , భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) ,స్వాగతించారు. ప్రత్యేక దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విచారణ వల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. కేవలం దురుద్దేశ ఆలోచనలతో తమపై కూటమి నేతలు నిందలను వేశారని , ఇది అన్యాయమని అన్నారు.
లడ్డూపై ఆరోపణల ద్వారా 140 కోట్ల హిందూవుల మనోభావాలను, ఆలయ ప్రతిష్టకు మచ్చ వచ్చే విధంగా చేశారని ఆరోపించారు. లడ్డూ తయారిలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీబీఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మొదటి నుంచి కోరుతున్నామని తెలిపారు. ఈరోజు భగవంతుడు రూపంలో సుప్రీంకోర్టు అదే రకంగా ఆదేశాలు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. సుప్రీం నిర్ణయంపై కొందరు తమను విమర్శించిన వాళ్లు కూడా స్వాగతించినట్లు నటిస్తున్నారని,
తమ హయాంలో ఏఆర్ కంపెనీ బిడ్లు కూడ వేయలేదు..
తాము అధికారంలో ఉన్న ఐదేండ్లలో ఏఆర్ కంపెనీ నెయ్యి సరఫరాకు టెండర్లలో బిడ్లు కూడా వేయలేదని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆ కంపెనీ నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్న సమయంలో నెయ్యి టెండర్లు పిలిచారు. ఆ సమయంలో ఉన్న అధికారులు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏఆర్ సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా , జరిగితే ఎవరి హయాంలో జరిగింది, ఏ పదార్థాలు కల్తీ జరిగాయి అనే విషయాలు విచారణ ద్వారా బయటకు వస్తాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.