Weather Report | వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గడిచిన మూడుగంటల్లో వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. కళింగపట్నం దక్షిణ-ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్యనున్న కళింగపట్నానికి దగ్గరగా శనివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఈశాన్యం, వాయువ్య అరేబియా సముద్రం మీదనున్న తుఫాను కేంద్రం నుంచి నలియా, మాలేగావ్, బ్రహ్మపురి, జగదల్పూర్, కళింగపట్నం, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలోనున్న వాయుగుండం కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా.. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజులు సైతం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.