అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ (YCP) ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళ్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former minister Kakani) పేర్కొన్నారు. బుధవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఐదేండ్ల వైసీపీ పాలన మున్నెన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు(Schemes) ఇంటింటికి వెళ్లి అందించామని పేర్కొన్నారు. అనేక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లామని తెలిపారు.
వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి అధికారంలోకి వస్తారని ధీమాతో ఉన్న తమకు ఫలితాలు ఆశ్చర్యానికి, బాధకు గురి చేశాయని వెల్లడించారు. ప్రజలెందుకు వైసీపీని తిరస్కరించారనే అనే కోణంలో సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. అధికారం ఉన్నప్పుడు ఉన్నామో, అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతోనే ఉంటామని అన్నారు.
ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. నిన్న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి మొత్తం 164 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది . 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151, టీడీపీకి 23, జనసేనకు ఒక సీటు వచ్చింది.