అమరావతి : కడపలో బుధవారం విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh ) స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఘటనా విషయం తెలియగానే ఆందోళన వ్యక్తం చేశారు.
కడప (Kadapa) పట్టణంలోని అగాడివీధి పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు (Students) మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో తెగి ఉన్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్ అనే విద్యార్థి మృతి చెందడం బాధాకరమని అన్నారు. గాయపడిన ఆదాం అనే మరో విద్యార్థికి మెరుగైన వైద్యం(Medical Treatment) అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కడప పట్టణంలోని అగాడివీధిలో జరిగిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.