విశాఖ జిల్లా : దొంగలు మామూలు వ్యక్తుల కన్నా కొంచెం ఎక్కువ తెలివైనోళ్లుగా ఉంటారు. అయితే, ఈ దొంగ మామూలు తెలివైనోడు కాదు. తాను కొట్టేసిన బైకును అదే బండి యజమానికి అమ్మాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో.. అడక్కుండానే సాయం చేసేందుకు ముందుకు వచ్చి మరీ అడ్డంగా బుక్కయైపోయాడీ దొంగ గారు.
వివరాల్లోకెళ్తే.. గాజువాకలోని వడ్లపూడి రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండే పడాల వినయ్సాయి బైక్ రైడ్ కంపెనీలో ఉద్యోగి. అయితే ఈ నెల 1వ తేదీన శ్రామికనగర్ నివాసి పి రమేష్ తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తి రమేష్‌కు ఫోన్ చేసి బైక్ బుక్ చేశారని బైక్ రైడ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. తాను బైక్ బుక్ చేయలేదని, బైక్ పోగొట్టుకున్నట్లు రమేష్ తెలిపాడు. కొంత డబ్బు ఇస్తే బైక్ కోసం వెతుకుతానని గుర్తుతెలియని వ్యక్తి రమేష్‌కు మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దాంతో రమేష్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషడం బయటపడింది.
బైక్ రైడ్ కంపెనీలో పనిచేస్తున్న వినయ్సాయి.. అప్పులు ఎక్కువ కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈజీ మనీ కోసం బైక్ దొంగగా మారాడు. చోరీ చేసిన బైక్‌ల యజమానులకే ఫోన్ చేసి డబ్బు ఇస్తే తమ బైక్‌లు దొరికేందుకు సహాయపడతానని చెప్తున్నాడు. పలువురు ఈ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పీ రమేష్ ఫిర్యాదు చేయడంతో ఈ దొంగగారి వ్యవహారం కాస్తా బయటకొచ్చింది. గాజువాక ప్రాంతంలో 2, దువ్వ ప్రాంతంలో 3, నాలుగో పట్టణం పీఎస్ పరిధిలో, ఎయిర్‌పోర్టు పరిధిలో, కంచరపాలెంలో ఒకటి చొప్పున బైకులను దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. దాంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.