హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. భూమిలోపల 10కి.మీ లోతులో అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షినగర్, రాంనగర్, మురళీనగర్, అక్కయ్యపాలెం, భీమిలిపట్నం మండల పరిసర గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. సెకన్ల వ్యవధిలోనే ప్రకంపనలు ఆగిపోగా, ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసు, ఫైర్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.