హైదరాబాద్: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట (Stampede) జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా, స్వీమ్స్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీచేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు. భక్తులను బైరాగిపట్టెడ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.