Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి గుర్తింపు లేదని.. పవన్ కల్యాణ్ దగ్గర పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు కూడా లేదని.. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మీద తొడ కొడుతున్నాడంటూ విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ బానిసలా బతుకుతున్నాడని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ తన జీవితాన్ని ధారాదత్తం చేశాడని అన్నారు. నిన్ను నమ్ముకుని పదేండ్లు జనసేన జెండా పట్టుకున్నారని.. గ్లాస్ పట్టుకున్నారని తెలిపారు. కానీ గ్లాస్‌ను అందరికీ ఇచ్చేశాడని.. జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు.
2014 మేనిఫెస్టోకు.. ఇప్పటి మేనిఫెస్టోకు ఏదైనా తేడా ఉందా? అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలనే ఇందులో చేర్చారని విమర్శించారు. 2014లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అప్పుడు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏం చేయలేదు.. ఇప్పుడు కూడా అలాగే ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను చిత్తుకాగితంలా చూస్తారని దుయ్యబట్టారు. అదే జగన్ మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్లా చూస్తారని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత చంద్రబాబును చెత్తబుట్టలో వేయడం ఖాయమని జోస్యం చెప్పారు.