విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు, పేర్ల నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రాయలసీమ జిల్లాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవగా.. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతున్నది. గత నెలలో వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించారన్న విషయం సంచలనం రేపింది. దీన్ని తమ వైపు తిప్పుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ పోటీ పడి మరీ రాధతో భేటీలు నిర్వహించాయి. చివరకు ఓ అనుమకుడిని అరెస్ట్ చేయడంతో గొడవ పక్కకెళ్లిపోయింది. తాజాగా వంగవీటి మోహనరంగా పేరును వాడుకోవాలని ప్రతిపక్షం నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది.
జిల్లాల ఏర్పాటులో కొత్తగా ఏర్పడనున్న విజయవాడ జిల్లాకు ఎన్టీ రామారావు పేరు ఖరారు చేసినట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. అయితే, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి కాపులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ ఎత్తులు వేస్తున్నది. విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని టీడీపీ నుంచి డిమాండ్ వినవస్తున్నది. విజయవాడలో పేదల కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించిన రంగా పేరు విజయవాడ జిల్లాకు పెట్టడం సబబుగా ఉంటుందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేపు ధర్నా చౌక్‌లో దీక్ష నిర్వహించాలని కార్యాచరణతో ఉన్నారు.
వంగవీటి రంగా వంటి మహానేత పేరును ఒక జిల్లాకు పెట్టకపోతే సీఎం జగన్ ఆయన్ను అవమానించినట్లుగానే భావించాల్సి వస్తుందని టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ చెప్పారు. ముఖ్యమంత్రి కోటరీ నుంచి ఒక్కరు కూడా ఈ విషయంపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాల్సిందేనని బోండా ఉమ డిమాండ్ చేశారు.