Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని నూక మల్లికార్జునరావుగా విజయవాడ పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో మల్లికార్జునరావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే అతను బెదిరింపు కాల్స్‌కు పూనుకున్నట్లుగా సమాచారం. గతంలో సైతం వైజాగ్‌లో మల్లికార్జున రావుపై పోలీసులు కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పేషీకి ఇటీవల రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్, సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేషీకి 95055 05556 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ నంబర్ ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్‌లో ఇప్పటికే మల్లికార్జున్‌పై కేసు నమోదైనట్లుగా గుర్తించారు.