అమరావతి: అభివృద్ధి పనులు చేపట్టడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లా ఉత్తమ పనితీరు ప్రదర్శించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మిషన్ డైరెక్టర్ రాకేష్ రంజన్ లేఖ ద్వారా అగ్రస్థానం సాధించిన సమాచారమిచ్చారు. 2022 మే నెలలో ఇండ్ల నిర్మాణం, రోడ్ల పనులు చేపట్టడంలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. ఇలాంటి రంగాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
క్షేత్రస్థాయిల్లో ప్రమాణాలు పెంపొందించేందుకు పూర్తి ప్రయత్నాలతో కృషి చేస్తున్నందున దేశంలోనే మొదటి స్థానం లభించిందని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి నేతృత్వంలోని వివిధ శాఖల కృషితో సంబంధిత రంగాల్లో మంచి ఫలితాలు సాధించడంలో దేశంలోనే అగ్రస్థానం దక్కింది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేయడం వల్లనే దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యులకు ఇళ్ల సౌకర్యం కల్పించే లక్ష్యంతో జగనన్న కాలనీలను చేపట్టడం, గ్రామాలకు రోడ్లు వేయడానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పూర్తి చేయడం.. ఈ రెండు కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపట్టి సత్ఫలితాలను సాధించింది. వివిధ శాఖల సమష్టి కృషి వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. ఈ జిల్లాకు పోటీగా మరికొన్ని జిల్లాలు ముందుకు రావాలని, అప్పుడే మరింత వేగంగా సంక్షేమం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.