Brahmamgari Matam | మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాలకు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి ఒక మిద్దె ఉంది. అందులోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించేవారు. అయితే తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మట్టి మిద్దె నాని పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
బ్రహ్మంగారు నివసించిన ఈ మిద్దె దాదాపు 350 ఏళ్ల క్రితం నాటిది అని.. మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే గోడలతో పాటు పైకప్పు కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అతి పురాతనమైన, చారిత్రాత్మక వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల అధికారులు, పాలకులు శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బ్రహ్మంగారి నివాసాన్ని పునరుద్ధరించాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.