Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లకు శాస్త్రోక్తంగా కార్తీకమాస నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. గురువారం దత్తాత్రేయ స్వామికి వేద పండితులు అభిషేకార్చనలు చేశారు. అటుపై ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో బ్రాహ్మణులు మూలా నక్షత్రం సందర్బంగా భ్రమరాంబదేవికి ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం అమ్మవారికి ప్రీతికర పుష్పాలతో అలంకరణ చేసిన ఊయలలో వేంచేబుచేసి షోడశోపచార పూజా క్రతువులు త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శత నామావళితో అర్చనలు చేశారు. అనంతరం అర్చక వేదపండితులు ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవను ఘనంగా నిర్వహించి భక్తులకు స్వామిఅమ్మవార్ల దర్శనాలు కల్పించారు.
కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రధాన ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతాహ్వాన లాంఛనంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈవో దంపతులతోపాటు అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా క్రతువులు నిర్వహించారు. అటుపై భక్తులకు దర్శనాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.