Vasudha Pharma | విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలో విషాదం నెలకొంది. వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రగతి మైదానంలో సోమవారం ఉదయం మృతదేహం స్థానికుల్లో కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ నాగవరప్రసాద్గా గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగవరప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యలు లేదా మరే ఇతర కారణాలతో ఆయన బలవనర్మణానికి పాల్పడి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.