Vasireddy Padma | వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. విజయసాయి చీప్ ట్వీట్స్ పెట్టడం సరికాదని ఆమె విమర్శించారు. సీపోర్టు అక్రమాలు, రేషన్ మాఫియాను తప్పుదారి పట్టించడం కోసమే ఆయన ట్వీట్స్ చేస్తున్నారని అన్నారు. ఇలాగే ఉంటే వచ్చేసరి వైసీపీకి 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. శనివారం ఉదయం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. విజయసాయి సలహాతోనే వైసీపీ ఓటమి పాలైందని ఆరోపించారు. వైసీపీ బాధ్యతలు విజయమ్మకు అప్పగించాలని సూచించారు. వారం రోజుల్లో టీడీపీలో చేరతానని ప్రకటించారు.
ఇటీవల వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడారు. ఆ సమయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడిన వారికోసం జగన్ ఇప్పుడు గుడ్‌బుక్, ప్రమోషన్లు అని అంటున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌బుక్ కాదు.. గుండె బుక్ అని స్పష్టం చేశారు. వారికి ప్రమోషన్లు అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని అన్నారు. ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్.. గుడ్‌బుక్ పేరుతో మరోసారి మోసంచేయడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.
జగన్‌కు పార్టీని నడిపించడంలో బాధ్యత లేదని.. పరిపాలన చేయడంలో బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని గత ఎన్నికల తీర్పు స్పష్టంచేసిందని అన్నారు. వ్యక్తిగతంగా విధానాల పరంగా అనేక సందర్బాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజా తీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.