తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ( Padmavati Temple) లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారుచీరతో అలంకరించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.
రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు.
రాత్రి అమ్మవారిని స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి భక్తులలకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె.శ్యామల రావు , చంద్రగిరి ఎం.ఎల్.ఏ పులివర్తి నాని (MLA Pulivarti Nani , జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, భక్తులు పాల్గొన్నారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న వ్రత మండపం
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది రకాల 20 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని రూపొందించారు.