Vangalapudi Anitha | చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి తమది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. రికార్డులు, లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 2019-24 కాలంలో తప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారంపై మండలిలో మంగళవారం నాడు ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత ఈ మేరకు సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం చాలామందిపై అక్రమ కేసులు పెట్టిందని తెలిపారు. అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. తనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని చెప్పారు. చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రికార్డులు, లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా అంగన్వాడీలు, ఆశావర్కర్లు తదితరులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వంగలపూడి అనిత తెలిపారు. పోలీసు, లా డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ టీచర్లు చేసిన ఆందోళనలకు దిగితే 149 కేసులు పెట్టారని వంగలపూడి అనిత తెలిపారు. వాటిలో 80 శాతం కేసులను ఇప్పటికే ఎత్తివేశామని పేర్కొన్నారు. మిగిలిన కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.