Undavalli on YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండి పడ్డారు. విపక్షంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని గగ్గోలు పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లి విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం కట్టి ఇవ్వాలి. ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు అని నాడు విపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఎందుకు అదే కొనసాగిస్తున్నారు. జగన్ చెప్పినట్లు ఆయన ప్రభుత్వం రాగానే కేంద్రానికి స్వాధీనం చేయాలి` అని అన్నారు.
`ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలు లేవు. ఎందుకిక్కడ అనవసర ఖర్చుఅని కేంద్రం భావిస్తోంది. మన ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా?` అని ఉండవల్లి ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని ఉండవల్లి నిలదీశారు.
`నేను ప్రజలకు డబ్బులిచ్చాను. వాళ్లు నాకు ఓటేయాలి.. ఇదే జగన్ పాలసీ. ఇదే క్విడ్ప్రో కో అంటే.. ఓట్లేయని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు. ఈ పాలసీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవంతం అవుతారా?.. కారా.. అంటే ఎవరూ చెప్పలేరు` అని ఉండవల్లి పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్యాంబ్లింగ్ పాలసీ ఎవరూ అమలు చేయకపోవడమే దీనికి కారణం అని అన్నారు. అయినా ఎంత కాలం ఏపీ సీఎం జగన్ డబ్బు పంచగలరు, ఎక్కడనుంచి తేగలడు అని వ్యాఖ్యానించారు.
నిధుల మళ్లింపుపై కేంద్రం విచారణ జరుపుతున్నదని వార్తలొచ్చాయని ఉండవల్లి అన్నారు. కేంద్రం విచారణలో ఏ ఫలితం వచ్చినా సీఎం జగన్ ఏమీ ఫీల్ కారన్నారు. పేద ప్రజలకు ఇచ్చానని చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు.