హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు వారు తెలిపారు. మస్తాన్‌రావుకు నాలుగేండ్లు, మోపిదేవికి రెండేండ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు మోపిదేవి ప్రకటించగా, మస్తాన్‌రావు కూడా అదేబాటలో పయనిస్తున్నట్టు తెలుస్తున్నది. మరో ఆరుగురు వైసీపీ ఎంపీలు కూడా అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నట్టు, వారు కూడా త్వరలోనే పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.