ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా గొల్లగుప్పలో తీవ్ర విషాదం నెలకొంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఒక విద్యార్థిని మృతిచెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా మలేరియా నివారణకు స్థానిక పాఠశాల, అంగన్వాడీ చిన్నారులకు క్లోరోక్విన్ మాత్రలను ఇచ్చారు. దాదాపు 71 మంది చిన్నారులకు అధికారులు దగ్గరుండి ఆ మాత్రలు వేయించారు. అయితే ఆ మాత్రలు వికటించడంతో గొల్లగుప్ప గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి జమున అస్వస్థతకు గురైంది. ఇంటి వద్ద వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే లక్ష్మీపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. అలాగే పద్దం రోజా కూడా మరణించినట్లుగా తెలిసింది.
అలాగే క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న గొల్లగుప్ప పాఠశాల, అంగన్వాడీ చిన్నారులు సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందర్ని లక్ష్మీపురం పీహెచ్‌సీకి, మరికొందర్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా చిన్నారులంతా రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు వారే కావడం గమనార్హం.
🚨 క్లోరోక్విన్ మాత్రలతో ఇద్దరు విద్యార్థులు మృతి ఐదుగురి పరిస్థితి విషమం
📝 ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో 73 మంది విద్యార్థులకు పాఠశాల సిబ్బంది క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసినట్లు సమాచారం.
📝 మాత్రలు వేసుకున్న తర్వాత సుమారు 20 మంది విద్యార్థులు… pic.twitter.com/ZmdhTe7cDw
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 1, 2026
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పోలవరం జిల్లా కలెక్టర్‌తో ఆయన సమీక్షించారు. ఘటనపై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించామని.. మరో 24 మందికి లక్ష్మీపురం పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా అధికారులను ఆయన అదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.