విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తులను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినట్లుగా నేరారోపణ ఉన్నది. అదుపులోకి తీసుకున్న సీఏ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు సెప్టెంబర్ 7 వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను పెంచారంటూ డిజైన్‌టెక్‌పై 2017లో పుణెలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ కేసు నమోదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఏపీఎస్ఎస్డీసీ హై-ఎండ్ టెక్నాలజీ శిక్షణను అందించడం కోసం సిమన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వివిధ శిక్షణా కార్యక్రమాలను అందించింది. ఏపీఎస్ఎస్డీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఘంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కలిసి నిబంధనలను తుంగలో తొక్కారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది.
ఈ కేసులో ఏ6 గా ఉన్న సౌమ్యాద్రి శేఖర్ బోస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, సాంకేతిక భాగస్వాములు ఏ పనిని అమలు చేయకుండానే ప్రభుత్వ వాటాగా డిజైన్‌టెక్ కంపెనీకి అనుకూలంగా రూ.371 కోట్లను ముందుగానే విడుదల చేయించుకోగలిగారని డిపార్ట్మెంట్లోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు విపిన్ కుమార్ శర్మ, ఆయన భార్య నీలం శర్మను అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టు హాజరుపర్చారు. ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.