అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో పిడుగుపాటుకు (Lightning) ఇద్దరు వ్యవసాయ మహిళా కూలీలు మృతి చెందారు. టకంపాడురోడ్డు వద్ద బుధవారం వరి పొలంలో పనిచేస్తున్న మహిళలపై పిడుగు పడడంతో వలపర్ల మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే చనిపోగా గాయపడిన నీలం మాణిక్యమ్మను ఆస్పత్రికి ( Hospital ) తరలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారింది. వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
అల్పపీడనం నేపథ్యంలో ప్రకాశం, వైఎస్ఆర్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది.
హోంమంత్రి అనిత సమీక్ష
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపించాలని సూచించారు. సహాయకచర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అప్రమత్తమంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సహాయం కోసం24 గంటలు టోల్ ఫ్రీ నంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు.