Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలక ట్విస్ట్ నెలకొంది. టెక్కలిలోని దువ్వాడ నివాసం ఇప్పుడు క్యాంప్ ఆఫీసుగా మారింది. ఈ మేరకు మంగళవారం నాడు అక్కడ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ వివాదం మొదలైనప్పటి నుంచి అదంతా టెక్కలిలోని నివాసం చుట్టే తిరుగుతుంది. తనను, తన కుమార్తెను ఆ ఇంట్లోకి అనుమతించాలని దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నారు. తన డబ్బులతోనే దువ్వాడ ఎదిగారని.. అందుకే అతని ఆస్తులను తనకే ఇవ్వాలని కోరారు. కానీ దువ్వాడ శ్రీను మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తన కూతుళ్ల పేరు మీద సుమారు 29 కోట్ల ఆస్తులు అయినా రాయడానికి సిద్ధంగా ఉన్నానని.. కానీ ఆ ఇంటిని మాత్రం ఇవ్వనని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తన ఇంటి నుంచి వెళ్లిపోయి లీగల్గా పోరాడాలని దువ్వాడ శ్రీనివాస్ కరాఖండీగా చెప్పినప్పటికీ వాణి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 13 రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటి ముందే పడిగాపులు కాస్తూ ఆందోళన చేపట్టింది. ఇలాంటి క్రమంలో దువ్వాడ శ్రీను ఇంటిని క్యాంప్ ఆఫీసుగా మార్చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.