TTD | హైదరాబాద్ : ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం(జులై 24) టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే అంగప్రదక్షణ టోకెన్లతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లు కూడా విడుదల చేయనున్నారు. వికలాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్లు కూడా సోమవారమే విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
మంగళవారం రోజు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కూడా టీటీడీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను జూలై 25న టీటీడీ విడుదల చేయనుంది. గదులకు సంబంధించి కూడా వివరాలు వెల్లడించనున్నారు. తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబర్ నెలకు సంబంధించి గదుల సమాచారాన్ని జూలై 26న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.