హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టీటీడీ అధికారులు టోకెన్లను అందజేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియటంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఎస్ టోకెన్ల జారీని నిలిపేసి, భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించారు. వారి దర్శనాలూ ముగియటంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని ప్రారంభించారు.
కాగా, గత డిసెంబర్ 30న తిరుమలలో ప్రారంభమైన అధ్యయనోత్సవాలు గురువారం సంపూర్ణమయ్యాయి. ఈ నెల 25న సర్వ ఏకాదశి, 27న మాస శివరాత్రి, 29న పురంధర దాస ఆరాధన మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్ యంత్రాన్ని విరాళంగా ఇచ్చింది.