తిరుమల : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో (Ex officio Member ) సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ( TTD ) ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేదపండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల కరికాలవలవన్ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన వేంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు, అధికారుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.