తిరుపతి : టిటిడికి చెందిన ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాలతో అద్భుతమైన శ్రీవారి కళారూపాన్ని తయారు చేశాడు. ఈ విద్యార్థిని శుక్రవారం టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈవో సదా భార్గవి అభినందించారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఎం.మధుసూదన్ కుమారుడు ఎం.ఓంకార్ ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసి రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతోపాటు చదువుకుంటూనే ఓ పక్క కాగితాలతో దేవతామూర్తుల బొమ్మల తయారు చేయడం నేర్చుకున్నాడు.
ఈ విధంగా 2 నెలల సమయంలో మూడు అడుగుల ఎత్తు గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమను రూపొందించాడు. మొదట కాగితాలను ఉపయోగించి శ్రీవారి ఆకృతిని తయారు చేశాడు. ఆ తరువాత వాటికి రంగులు అద్ది పూర్తి రూపాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం ఇదే తరహాలో శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమను తయారు చేస్తున్నాడు.
కాగితాలతో దేవతామూర్తుల ప్రతిమలను సృష్టిస్తున్న విద్యార్థి ఓంకార్ కళాత్మకత అద్భుతమని జెఈవో కొనియాడారు. టిటిడి విద్యాసంస్థల్లో చిత్రలేఖనంలో ఇలాంటి ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి దేవతామూర్తుల చిత్రాలు రూపొందించాలని, ఇలాంటి చిత్రాలతో రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటుచేసి భక్తులకు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని డిఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిటిడి విద్యాశాఖాధికారి గోవిందరాజన్, ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ రావు పాల్గొన్నారు.