TTD | వైకుంఠ ద్వారం రోజుల్లో టోకెన్లు లేని భక్తులకు దర్శనాలుండవని దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నయ్య భవన్లో ఆయన వైకుంఠ ఏకాశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో టోకెన్ లేని భక్తులు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించడం సాధ్యం కాదన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు పది రోజుల పాటు సిఫారసలు లేఖలు స్వీకరించడం లేదన్నారు. ఈ నెల 9న తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 90 కౌంటర్లలో, తిరుమలలోని ఒక కేంద్రం (స్థానికులకు) మాత్రమే నాలుగు కౌంటర్లలో భక్తులకు 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1.20 లక్షల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తామన్నారు. భక్తులు సంయమనంతో టోకెన్లు పొందాలన్నారు.
13 నుంచి 19 వరకు ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామన్నారు. పదిరోజులు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని.. భక్తులెవరూ అధైర్యపడొద్దన్నారు. ఆరోగ్య భద్రత దృష్ట్యా భక్తులు మాస్కులు ధరించి తిరుమలకు రావాలని సూచించారు. ఈ నెల 10న ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని.. ఆ దర్శనాలు పూర్తికాగానే 8 గంటలకు సర్వదర్శనాలు మొదలవుతాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై వీధులలో విహరిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మలయప్పస్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు బీఆర్ నాయుడు వివరించారు. పదిరోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు వివరించారు. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతిస్తామన్నారు.
పదిరోజుల పాటు తిరుమలలో వసతి గదుల ఆన్ లైన్ బుకింగ్ రద్దు చేసి సీఆర్వో వద్ద సామాన్య భక్తులకు వసతి గదులు కేటాయిస్తామన్నారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేది, సమయానికే దర్శనానికి రావాలని కోరారు. వీఐపీలకు జారీ చేసిన టికెట్లపై ముద్రించిన పార్కింగ్ వివరాల మేరకు తమకు కేటాయించిన సమయానికే వాహనాల్లో రావాలని కోరారు. తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల్లో, తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వివరించారు. విద్యుత్, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి మైసూర్ దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, పారిశుధ్యంపై దృష్టి పెట్టామన్నారు.