Tirumala | తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఇటీవల కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ దళారుల్లో కొందరు టీటీడీ కార్యాలయాల్లో, మంత్రులు, ప్రజాప్రతినిధుల పేషీల్లో పనిచేసే ఉన్నతాధికారులలా పరిచయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటనలు బయటకొచ్చాయని తెలిపారు.
భక్తులు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని బీఆర్ నాయుడు సూచించారు. దర్శనం లేదా వసతి కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 155257లో సంప్రదించాలని సూచించారు. భక్తులను మోసం చేస్తున్న దళారీలను గుర్తించి వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని.. దళారులపై అనుమానం వస్తే 0877-2263828 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.