Free Sand Policy | ఉచిత ఇసుకకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తవ్వుకుని ఎడ్లబండి, ట్రాక్టర్లలో రవాణా చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉచిత ఇసుక విధానంలో భాగంగా వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల నుంచి ఇసుకను తీసుకునేందుకు వీలుగా గత నెల 2వ తేదీన ఏపీ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తిగత అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఉచితంగా ఇసుకను తవ్వుకుని ఎడ్లబండ్లలో తీసుకెళ్లొచ్చని ఆ మార్గదర్శకాల్లో తెలిపింది. దీనికోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు ఉన్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా వాగులు, వంకలకు సమీపంలో ఉండే గ్రామస్థులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్తుంటే మాత్రం పోలీసులు ఆపి, జరిమానా విధిస్తారు. దీంతో ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేసింది.