ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పులుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో వరుసగా దూడలు మృత్యువాత పడుతుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. మూడు రోజుల వ్యవధిలో రెండు దూడలు మృతి చెందడంతో.. ముమ్మాటికి పులి పనే అని ప్రజలు అనుమానిస్తున్నారు.
ఈ నెల 24వ తేదీ రాత్రి ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో ఓ రైతు పొలంలో కట్టేసిన దూడను గుర్తు తెలియని జంతువు చంపి తినేసింది. మరుసటి రోజు ఉదయం సదరు రైతు పొలానికి వెళ్లి చూడగా ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను పోలిన గుర్తులు కనిపించాయి. అక్కడికి సమీపంలోనే దూడ కళేబరం కనిపించింది. 25వ తేదీ రాత్రి గుణ్ణంపల్లి సమీపంలోని నారాయణపురం శివారులోని పొలంలో గుర్తుతెలియని జంతువు మరో దూడను చంపి తినేసింది.
అదే రోజు రాత్రి మళ్లీ గుర్తు తెలియని జంతువు.. అక్కడే ఉన్న చనిపోయిన దూడ కళేబరాన్ని తినేసింది. దాంతో ఈ ప్రాంతంలో పులి వంటి జంతువు సంచరిస్తున్న ఆనవాళ్లను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు పులి సంచరిస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.