తిరుపతి : తిరుపతిలోని కోదండరామస్వామి (Kodandaramalayam) వారి ఆలయ పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతం(Suprabatam) తో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.
అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం(Triumanjanam) వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు.
ఆగస్టు 2న డయల్ యువర్ ఈవో
తిరుమల,తిరుపతిలో భక్తుల సలహాలు, సూచనల కోసం ప్రతి నెల నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో (Dial Your EO) కార్యక్రమాన్ని రేపు(శుక్రవారం) ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనం నుంచి నిర్వహించే కార్యక్రమాన్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వివరించారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చన్నారు. భక్తులు 0877-2263261 అనే నెంబర్‌కు ఫోన్‌కాల్ చేయవచ్చని సూచించారు.