తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ ఏపీ శ్రీనివాస దీక్షితులు, జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శాంతి, తదితరులు పాల్గొన్నారు.
సింహ వాహనంపై నరసింహస్వామి అలంకారంలో దర్శనం
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం స్వామివారు శ్రీ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవలో డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు
టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం
రష్యాకు చెందిన అచ్యుత మాధవ దాసు అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గురువారం రూ.7 లక్షల 64 వేలు విరాళంగా అందించారు. దాత తరపున ఆయన స్నేహితుడు కృష్ణ కన్నయ్య దాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఎవి ధర్మారెడ్డికి విరాళం డీడీలను అందజేశారు.ఇందులో ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ. లక్ష 64 వేలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేద పారాయణ ట్రస్టు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.