ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు రావడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. భక్తులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారా? అని నిలదీశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబును తప్పుబట్టిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. బహిరంగ సభ నిర్వహించడం న్యాయమేనా అని ప్రశ్నించారు.
తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు, నిరాధార ఆరోపణలకు చెంపపెట్టు అని తిరుపతి ఎంపీ మద్దిల్ల గురుమూర్తి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేసిందన్న విషయం ప్రస్తావించారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వ్యాఖ్యానించడం చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ అని విమర్శించారు. అత్యంత పవిత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని, ఆయన ప్రసాదాలను రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా వివాదంలోకి లాగి వైసీపీ, వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలమైందని అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యంతో తిరుపతి బాలాజీ లడ్డూ కల్తీపై చంద్రబాబు చేసిన బూటకపు ఆరోపణలు త్వరలోనే బహిర్గతమవుతాయని పేర్కొన్నారు.
సరైన విచారణ లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తి గుర్తుచేశారు. అత్యంత సున్నితమైన ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బతీయడం సమంజసం అనుకుంటున్నారా? అని నిలదీశారు. మీ ముఖ్యమంత్రిలా మీరు కూడా తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రజలు, భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.