తిరుమల : తిరుమల (Tirumla) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణాతేజ గెస్ట్ హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 72,072 భక్తులు దర్శించుకోగా 30,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చిందన్నారు.\
కూరగాయల దాతలను అభినందించిన అదనపు ఈవో
రెండు దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం(Annaprasadam) కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుంచి పంపుతున్న కూరగాయల దాతలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ నినాదమని అన్నారు. అన్నప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భుజించే ఆఖరి భక్తునికి కూడా అందేలా మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలను కోరారు.