తిరుమల : తిరుమల (Tirumala ) శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Awar Tirumanjana) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆలయం వెలుపల టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO) మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) , వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు రాంభూపాల్ రెడ్డి, మూరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, డీఎల్వో వీర్రాజు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, అర్చకులు కిరణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.