శ్రీశైలం : పోలీసుల పహారాలో శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నది. ప్రభోత్సవం, నంది వాహన సేవ సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులతోపాటు దేవస్థానం సెక్యూరిటీ విభాగం అధికారులు భారీ బందోబస్తు కల్పించారు. ప్రభోత్సవం, నంది వాహన సేవల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా భారీగా బలగాలను పోలీస్ ఉన్నతాధికారులు మోహరించారు.
ఆలయ కమాండ్ కంట్రోల్‌రూం నుంచి సీఎస్‌వో, పర్యవేక్షకులు శ్రీహరితోపాటు పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. అదే విధంగా కర్నాటక మహారాష్ట్ర జిల్లాల నుంచి కాలినడకన క్షేత్రానికి చేరుకున్న యాత్రికులు తిరుగు ప్రయాణాలు చేసేందుకు ఆర్టీసీ పూర్తి ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆయా రాష్ట్రాల ఆర్టీసీ కంట్రోలర్లు తెలిపారు. సుమారు 1000 బస్సులకుపైగా ప్రయాణికులను చేరవేస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సూచనలు పాటించాలని పోలీస్ అధికారులు సూచించారు.