అమరావతి : ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలన్నదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawankalyan) ధ్యేయమని, అందుకోసమే ఆయన పోరాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) అన్నారు. ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని గౌరవించుకోవాలని పవన్ కల్యాణ్ చెప్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం వైసీపీకి అలవాటేనని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి జనసేన వాళ్లకు అండగా నిలబడుతూ వస్తూదని వెల్లడించారు. తిరుపతి లడ్డూ వివాదం సృష్టించిందే వైసీపీ అని ఆరోపించారు. వైసీపీ పాలనలో మతం, భాష అంటూ ప్రజలను విడగొట్టారని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేసుకోవద్దని, గ్రామస్థాయిలో పర్యటించి ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలన్నారు. గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామని, వాణిజ్య పంటలు పండించే రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.