అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుపై ( Chandra Babu) ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. ‘ ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ అనే సామెతను తలపిస్తోందని ట్విటర్లో (Twitter) ఆరోపించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ (Super Six) అంటూ ఆర్భాటం చేసిన బాబు .. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని దుయ్యబట్టారు.
అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుందని బాబు వ్యవహారముందని ఆరోపించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలుకు ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? తెలియదా అంటూ ప్రశ్నించారు.
” ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి @ncbn తీరు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని,…
— YS Sharmila (@realyssharmila) January 17, 2025
రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? అని అన్నారు. కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ?. రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసమని నిలదీశారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా..పనితనం శూన్యమని విమర్శించారు.
ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి. నిధులు పారాలన్నా, పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా. ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని షర్మిల పేర్కొన్నారు.