అమరావతి : ఏలూరు జిల్లా వేలేరుపాడు (Velerupadu ) మండలం కోయమాదరం, విప్పలకుంపు గ్రామాల మధ్య ఉన్న లోతువాగులో కొట్టుకుపోయిన బాధితులను గ్రామస్థులు, పోలీసులు సురక్షితంగా (Rescued ) ఒడ్డుకు చేర్చారు. దాదాపు 5 గంటల పాటు ఉత్కంఠగా మారిన ఘటన చివరకు సుఖాంతమైంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడుకు కారులో బయలు దేరిన కుటుంబం గురువారం లోతువాగు ప్రవాహం గమనించకపోవడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ సమయంలో డ్రైవర్ రామారావు, జ్యోతి(50), గడ్డం సాయికుమారి(30), గడ్డం కుందన కుమార్(11), గడ్డం జగదీష్‌కుమార్ (8) మొత్తం ఐదుగురు కారులో ఉన్నారు.
కారు వాగుమధ్యలో ఉన్న చెట్ల పొదల్లో చిక్కుకుపోవడంతో అందులో ఉన్న వారంతా కారు నుంచి బయటకు వచ్చి పొదలు, చెట్ల మధ్యలో చిక్కుకుపోయి అక్కడి నుంచి ఆర్తనాదాలు చేశారు. గమనించిన గ్రామస్థులు (Villagers) అక్కడికి చేరుకుని పోలీసులకు(Police) సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ తాళ్ల సహాయంతో బాధితుల వద్దకు వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరోవైపు వేలేరుపాడు వాగులో కారు కొట్టుకుపోయిన విషయాన్ని తెలుసుకున్న సీఎంవో (CMO ) కార్యాలయం అధికారులు జిల్లాకలెక్టర్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేయగా అప్పటికే గ్రామస్థుల సహాయంతో బాధితులు ఒడ్డుకు చేరుకున్నారు.