అమరావతి : ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి కాని, వైఎస్ జగన్ ( YS Jagn ) లాంటి వ్యక్తి తల్లి, చెల్లికి అన్యాయం చేయడం దారుణమని ఏపీ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) ఆరోపించారు. ఆస్తుల పంపకంలో జగన్ నిర్ణయం వల్ల వైఎస్సార్( YSR ) ఆత్మ ఘోషిస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మిని ( Vijayalaxmi ) కోర్టుకు ఈడ్చడంతో ఆమె ఎంతగానో మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి సలహా, సూచనలు ఇవ్వాల్సిందిపోయి ప్రభుత్వంపై బురద చల్లడం పనిగా పెట్టుకున్నాడని జగన్ను విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
జగన్ పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. రానున్న కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి పాలన రావడం వల్ల పెట్టుబడుల రాకతో ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.