అమరావతి : ఏపీలో రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనను మరిచిపోకముందే పోలవరం దస్త్రాలు (Polavaram files ) దహనం కావడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలోని పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్దమయ్యాయి. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలను కార్యాలయానికి చెందిన వారే దహనం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. వెంటనే విచారణ ప్రారంభించాలని ఆదేశించడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.